
దుర్గా మాత నిమజ్జనంలో అపశృతి… పల్టీకొట్టిన క్రేన్..
దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు (శనివారం) ఉదయం విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. విగ్రహాల నిమజ్జన క్రేన్లలో జీహెచ్ఎంసీ అధికారులు కాసుల కక్కుర్తి పడినట్లు తెలుస్తోంది.
కమిషన్ల కోసం అధికారుల దురాశతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అనుభవం లేని సర్వీస్‌కు టెండర్ అప్పగించడంతో సరూర్‌నగర్ చెరువు వద్ద క్రేన్ పల్టీ కొట్టింది. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
అయితే క్రేన్ చెరువులో పడటంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు వైపు పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. అనుభవం లేని మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్‌కు జీహెచ్ఎంసీ లోకల్ అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు.
43 శాతం లెస్ అమౌంటు టెండర్ కేటాయించారు అధికారులు. ఒకే కంపెనీకి వివిధ చోట్ల కాంట్రాక్టులు అప్పగించారు.
ట్యాంక్ బండ్‌పై కూడా ఇదే కంపెనీకి అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు. క్రేన్ నడిపే డ్రైవర్లు అనుభవం ఉన్నవారికి మాత్రమే క్రేన్ అప్పగించాలని.. అడిషనల్‌గా మరో డ్రైవర్ కూడా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు తుంగలతో తొక్కారు అధికారులు.
అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవటంతో డ్రైవర్ తప్పిదమా.. క్రేన్ తప్పిదమా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



