
రెవెన్యూశాఖలో 217 పోస్టులు మంజూరు చేసిన సర్కార్
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే ఓ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయింది.
అందుకోసం రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ నేడు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన 15 కొత్త రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, అలాగే రెండు డివిజన్ల కోసం మరో 28 పోస్టులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది.
గద్వాల, నల్గొండ, వికారాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అతి త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కొత్త పోస్టులు మంజూరు చేయడం పట్ల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు సైతం, తమపై గల భారం తగ్గబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.