
మాజీ ఎంపీ కన్నుమూత…
సురవరం మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం
తెలంగాణ మట్టిబిడ్డ సుధాకర్‌రెడ్డి: కేసీఆర్
హైదరాబాద్ : సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు మూడు రోజులుగా హైదరాబాద్ శివారులోని జరుగుతుండగా, శుక్రవారం నూతన కమిటీ ఎన్నికతో సభలు ముగిశాయి.
ఇంతలోనే సురవరం మరణ వార్త తెలియడంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. సురవరం మరణం విషయం తెలియగానే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం.. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్‌ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది.
చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.
1998, 2004లో లోక్‌సభకు ఎన్నిక : 1950 చివరలో కర్నూలులోని పాఠశాలలకు ప్రాథమిక సౌకర్యాలను డిమాండ్ చేస్తున్న వారితో చేరడంతో సురవరంరెడ్డి సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభమైంది.
1960లో ఆయన సీపీఐ విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) కర్నూలు శాఖలో నిర్వహించిన అనేక పదవుల్లో మొదటి పదవిని చేపట్టారు.
తరువాతి దశాబ్దంలో ఆయన ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాలలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఏఐఎస్‌ఎఫ్ స్థానిక, జిల్లా, రాష్ట్ర విభాగాలలో నాయకత్వ పాత్రలను చేపట్టారు. 1966లో సురంవరం ఏఐఎస్‌ఎఫ్‌కు ప్రధాన కార్యదర్శి అయ్యారు.
తన రాజకీయ స్థావరాన్ని న్యూఢిల్లీకి మార్చారు. 1970లో ఆయన సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీపీఐ పార్టీలో మరింత క్రియాశీలక పాత్రపోషించారు. 1971లో ఆయన పార్టీ జాతీయ మండలికి ఎంపికయ్యారు.
1998లో నల్లగొండ నుంచి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యి మొదటిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. 1998-99లో మానవ వనరుల అభివృద్ధి కమిటీ, ఔషధ ధర నియంత్రణ ఉపకమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా సుధాకర్‌రెడ్డి సలహాదారుడిగా పనిచేశారు. 2004లో 14వ లోక్ సభకు మరోసారి నల్లగొండ నుంచి ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ సమితికి కార్యదర్శిగా, వక్ఫ్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
గ్రామీణాభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీ, సలహా కార్యవర్గ సమితిలోనూ, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలోనూ సభ్యులుగా ఉన్నారు. కార్మికస్థాయి సంఘం చైర్మన్‌గా కూడా సురవరం సుధాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సురవరం ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీల విలీనం కోరుకునే వారు.
గొప్ప నాయకుడు: బీఆర్‌ఎస్ నేతలు . సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప కమ్యూనిస్టు యోధుడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ప్రకటించిన గొప్ప నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి ఎంతో బాధకరమని, వారి ప్రజాసేవ, ఉద్యమపంథా చిరస్మరణీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సురవరంతో తనకు ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల సంతాపం : సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ రఘువీర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సంతాపం ప్రకటించారు. సురవరం కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ మట్టిబిడ్డ సురవరం: కేసీఆర్ . సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు.
పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా జీవితకాలం కృషిచేసిన తెలంగాణ మట్టిబిడ్డ సురవరం అని పేర్కొన్నారు. మార్క్సిస్టు ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. శోకాతప్తులైన సురవరం కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.