
అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి… రెండేళ్లుగా గృహనిర్బంధం
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతిరెండేళ్లుగా గృహనిర్బంధం చేసి, హింసించి చంపారని ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు.
రెండేళ్లుగా ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు.
ఒక్కసారిగా అల్లుడు ఫోన్ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని.. ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పరుగున వెళ్లారు. తీరా అక్కడ ఎముకల గూడులా మారి.. విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి హతాశులయ్యారు.
అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటుచేసుకుంది.
మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు, బంధువులు, అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వన్నాథంపురానికి చెందిన లక్ష్మీప్రసన్న(33)ను అదే మండలం ఖాన్‌ఖాన్‌పేట వాసి పూల నరేశ్‌బాబుకు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. తొమ్మిదేళ్ల క్రితం వారికి కుమార్తె పుట్టింది.
తరువాత నరేశ్‌బాబు ఆరేళ్లపాటు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉన్నాడు. మూడేళ్ల తర్వాత భార్యాబిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటున్నారు.
శనివారం నరేశ్‌బాబు అత్తామామలకు ఫోన్ చేసి.. లక్ష్మీప్రసన్న ఇంట్లో మెట్ల పైనుంచి కిందపడటంతో గాయాలయ్యాయని, దగ్గర్లోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పాడు.
దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీప్రసన్న మృతిచెంది ఉంది. ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు. శరీరమంతా కొత్త గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండటం చూసి తల్లడిల్లిపోయారు.
లక్ష్మీప్రసన్నను అదనపు కట్నం కోసం నరేశ్‌బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించేవారని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రెండేళ్ల నుంచి మాట్లాడనివ్వలేదు : ‘వివాహ సమయంలో రెండెకరాల మామిడితోట, అరెకరం పొలంతోపాటు రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చాం.
అశ్వారావుపేటకు వెళ్లిన ఏడాదిపాటు తమ కుమార్తె మాట్లాడేది. రెండేళ్ల నుంచి ఆమెను చూపించలేదు, ఫోన్ చేసినా మాట్లాడనివ్వలేదు. మేము వెళ్లినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారు.
ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపేశారు’ అని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు. నరేశ్‌బాబు బావ మాత్రం.. లక్ష్మీప్రసన్నకు రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయని, ఆమెను తల్లిదండ్రులకు చూపించలేదనడం అవాస్తమని చెప్పారు.