
టీచర్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టూడెంట్స్..
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉండే బంధం ఎంతో గొప్పది. తల్లిదండ్రుల తర్వాత గురువునే ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.
అలాంటి బంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ బదిలీపై వెళ్తుండగా, విద్యార్థినిలు ఆమెను వీడి ఉండలేక కన్నీటి పర్యంతమయ్యారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్లుగా ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వనజ టీచర్, తనదైన శైలిలో విద్యాబోధన చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనసులను గెలుచుకున్నారు. పిల్లలను సొంత బిడ్డల మాదిరి చూసుకుంటూ, వారికి చదువుతో పాటు మంచి నడవడికను నేర్పించారు.
వీడ్కోలు సమావేశంలో భావోద్వేగం..
ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయులకు కల్పించిన పదోన్నతుల్లో భాగంగా వనజ టీచర్ మోతే మండలం నామవరం ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో పాఠశాలలో ఆమెకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం అనంతరం వనజ టీచర్ అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. ఆమెను చూసి విద్యార్థినిలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమను వదిలి వెళ్ళవద్దంటూ టీచర్‌ను అడ్డుకున్నారు. పాఠశాల గేటుకు అడ్డంగా నిలబడి గట్టిగా ఏడ్చేశారు.
చిన్నారుల అమాయకమైన ప్రేమ, వారి కళ్లలో కనిపించిన బాధను చూసి టీచర్ వనజ కూడా కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లతోనే పిల్లలను ఓదార్చి, మనసులో భారంతో అక్కడి నుంచి వీడ్కోలు పలికారు.
ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య ఉండే అపురూపమైన బంధానికి ఈ సంఘటన మరోసారి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.