
గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్.. సర్పంచుల ఎన్నికలపై ఈసీ కసరస్తు…
2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహణ మందకొడిగా సాగుతోంది.
కానీ.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన జూన్ 25న తుది తీర్పును న్యాయస్థానం వెలువరించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయస్థానంలో 6 పిటిషన్లు దాఖలు అయ్యాయి.
సర్పంచ్ల పరిపాలన లేక గ్రామాల అభివృద్ధి వెనుకబడుతోందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్న విషయం విదితమే. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పును జస్టిస్ టి.మాధవిదేవి వెలువరించారు.
తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. గతేడాది జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను స్పెషల్ అధికారులకు అప్పగించడం, రాజ్యాంగానికి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం అని పేర్కొన్నారు.
ప్రత్యేక అధికారులు వారికున్న ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు తమ సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుతం ఆ నిధులు అందక నానా అవస్థలు పడుతున్నారని, వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు.
వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.