HyderabadPoliticalTelangana

సాదా బైనామాలకు హైకోర్టు గ్రీన్ సిగల్

సాదా బైనామాలకు హైకోర్టు గ్రీన్ సిగల్

సాదా బైనామాలకు హైకోర్టు గ్రీన్ సిగల్

హైదరాబాద్ : సాదా బైనామాల క్రమబద్ధీకరణకు లైన్​క్లియర్ ​అయింది. పాత ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ స్థానంలో కొత్త గా భూభారతి చట్టం తెచ్చినందున.. పాత యాక్ట్‌పై వేసిన పిల్ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు డిస్మిస్​కావడంతో ఇన్నాళ్లూ అగిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సుమారు 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఫీల్డ్​ఎంక్వైరీ అనంతరం అర్హులందరికీ పట్టాదారు పాస్​పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020లో అప్పటి ప్రభుత్వం జీవో 112 జారీ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీవో అమలును నిలిపివేస్తూ 2020 నవంబర్‌ 11న మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

వీటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పాత ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ 71 రద్దయ్యి, కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున.. పాత యాక్ట్​లోని నిబంధనలను సవాల్‌ చేస్తూ వేసిన పిల్‌పై ప్రస్తుతం విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది.

పిల్‌పై విచారణ చేపట్టాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. పాత చట్టానికి బదులుగా వచ్చిన కొత్త చట్ట నిబంధనలను కూడా సవాల్‌ చేస్తూ పిల్‌ను సవరిస్తూ అనుబంధ అఫిడవిట్‌ వేశామన్న పిటిషనర్‌ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. కొత్త చట్టానికి తగ్గట్టుగా పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చునని సూచించింది.

సవరణ పిటిషన్​ఎందుకు వేశారు?ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదించారు. 2014కు ముందు 12 ఏండ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వ గడువు మేరకు సుమారు 9.25 లక్షల అప్లికేషన్లు అందాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తీసుకువచ్చిందని, ఇందులో సెక్షన్‌ 6 ప్రకారం 2014కు ముందు 12 ఏండ్లపాటు భూమి స్వాధీనంలో ఉన్నవారికి క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది జె. ప్రభాకర్‌ వాదిస్తూ.. పాత చట్టంలోని నిబంధనల మేరకు పిల్‌ వేసిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూభారతి చట్టంలోని నిబంధనను కూడా సవాల్‌ చేస్తూ సవరణ పిటిషన్‌ వేసినట్లు చెప్పారు. కొత్త చట్టంలో కూడా పాత దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తున్నారని, . కొత్తవాటిని తీసుకోకపోవడం వివక్ష కిందికే వస్తుందన్నారు.

పిల్‌ను విచారించాకే తుది ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కొత్తగా పిల్‌ దాఖలు చేస్తామని, కనీసం వారం రోజుల వరకు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పాత చట్టంలోని నిబంధనలను సవాల్‌ చేసిన పిల్‌ విషయంలో కొత్త చట్ట నిబంధనలపై కూడా ఎందుకు పట్టుబడుతున్నారని ప్రశ్నించింది.

సవరణ పిటిషన్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందని నిలదీసింది. పాత పిల్‌లోని విషయాలను ఆధారంగా చేసుకొని కొత్త చట్టంలోని అంశాలపై ఉత్తర్వులు కోరడం సబబు కాదని పేర్కొంది. కొత్త అంశాలతో దాఖలు చేసిన సవరణ పిటిషన్‌కు అనుమతి ఇవ్వలేమని వెల్లడించింది.

అప్లికేషన్లలో 10 లక్షల ఎకరాలు సాదాబైనామా అప్లికేషన్లు పరిష్కారమైతే రాష్ట్రంలో సాదాబైనామాలకు సంబంధించిన భూ వివాదాలు తగ్గనున్నాయి.

2020 అక్టోబర్‌ 30 లోపు, అక్టోబర్‌ 30 నుంచి నవంబరు 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్​ ( భూ భారతి యాక్ట్​) ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలో గతంలో భూముల క్రయవిక్రయాలు నోటి మాట, తెల్లకాగితాలు, బాండ్ పేపర్లపై ఒప్పందాలతో జరిగేవి.

ఇలా కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయించుకోకపోవడం వల్ల అవి సాదాబైనామాలుగా మిగిలిపోయాయి. సాదాబైనామా పత్రాలున్న రైతులందరికీ 13-బి ప్రొసీడింగ్‌లను జారీ చేసి పట్టాదారు పాస్​పుస్తకాలను అందిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది.

2014 జూన్ 2 కంటే ముందు తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించడానికి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడత సుమారు 12,64,000 మంది రైతులనుంచి అప్లికేషన్లు తీసుకున్నారు.

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకం చట్టం-1971 ప్రకారం.. అర్హులైన రైతులకు 13-బి ప్రొసీడింగ్‌లను జారీ చేసి, దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.

ఆ తర్వాత రైతుల వినతుల మేరకు సాదాబైనామాకు మరోసారి అవకాశం కల్పిస్తూ 2021 అక్టోబరు 18న గత ప్రభుత్వం జీవో-112ను విడుదల చేసింది. అక్టోబర్‌ 30 వరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రభుత్వం మళ్లీ 2020 నవంబరు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ అక్టోబరు 30న ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 30వ తేదీ వరకు సుమారు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. 2020 అక్టోబరు 30 నుంచి నవంబరు 10 వరకు కేవలం 11 రోజుల్లో సుమారు 6,74,201 దరఖాస్తులు వచ్చాయి.

సాదాబైనామాల రెండో విడత క్రమబద్ధీకరణకు 9.25 లక్షల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇక కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లోనూ దాదాపు రెండున్నర లక్షలు సాదా బైనామా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులోనూ గతంలో ఆన్​లైన్‌లో అప్లై చేసుకున్నవి అయితేనే వాటిని పరిగణనలోకి తీసుకోనున్నారు.

హైకోర్టు తీర్పుతో సాదాబైనామా రైతులకు ఊరట లభిస్తుందని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ తెలిపారు.

సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల కేసులో కోర్టు తీర్పుతో రైతులకు శాశ్వత హక్కులు లభిస్తాయని ఒకప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 9 లక్షలకు పైగా మంది రైతులకు మేలు జరగడంతో పాటు సుమారు 10 లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్ జారీ అవుతాయని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ సంపూర్ణం అయితే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు.

ప్రస్తుతం ఇదీ స్టేటస్​ : గతంలో 9,00,894 దరఖాస్తులపై జరిపిన ప్రాథమిక విచారణలో 4,04,807 దరఖాస్తులను అర్హతలేనివిగా గుర్తించారు. మిగిలిన 4,96,889 దరఖాస్తులు క్షేత్రస్థాయి విచారణకు అర్హమైనవిగా తేల్చారు.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రాసెస్ చేయాల్సిన 2,26,693 దరఖాస్తుల్లో, ప్రాథమిక విచారణలో సుమారు 97,454 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 1,29,239 దరఖాస్తుల అర్హతను నిర్ధారించడానికి క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంది.

లక్షలాది మందికి న్యాయం : మంత్రి పొంగులేటి

భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టే కొట్టివేయడంతో లక్షలాది మందికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

సాదా బైనామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని అన్నారు. గతంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు.

ఫలితంగా 9.26 లక్షల అప్లికేషన్లు పరిష్కారం కాకుండా పోయాయని, దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!