
నీట మునిగిన రెసిడెన్షియల్ స్కూల్… వరదల్లో చిక్కుకున్న సుమారు 300 మంది విద్యార్థులు
అల్పపీడనం తెలంగాణలో బీభత్సం సృష్టించింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభ వృష్టి కురిసింది.
కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కామారెడ్డి పట్టణం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎటుచూసినా పట్టణంలో వరద నీరు కనిపిస్తోంది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించే కనిపించాయి. ఒకవిధంగా చెప్పాలంటే నీటిలో కామారెడ్డి పట్టణం విలవిలలాడింది. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తింది.
ఫలితంగా భారీగా గండి పడింది. పరిస్థితి గమనించిన అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితి గమనించిన అధికారులు కామారెడ్డి, మెదక్ జిల్లాలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో NH-44 స్తంభించింది. దాదాపు 9 కిలోమీటర్ల మేరా వాహనాలు బారులు తీరాయి. కామారెడ్డి జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవుని పల్లి పీఎస్ పరిధిలోని ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ నీట మునిగింది. విద్యార్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అధికారులు, వారిని కాపాడి సురక్షిత వేరే ప్రాంతానికి తరలించారు.
అత్యంతకరంగా మారింది కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు. వరద పోటెత్తడంతో వంతెన పైనుంచి పారింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 75 వేల క్యూసెక్కులు. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి పడింది. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశముందని స్థానికులు బెంబేలెత్తుతున్నారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32 సెంటీ మీటర్లు, మెదక్ జిల్లా సర్దానలో 30 సెంటీ మీటర్లు, కామారెడ్డి పట్టణంలో 29 సెంటీమీటర్లు వర్షం నమోదు అయ్యింది.
ఈ స్థాయిలో వరద ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. కామారెడ్డి జిల్లా భిక్నూర్లో 27 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 27.5 సెం.మీ,పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ వర్షం పడింది.