
గురుకుల పాఠశాల, కళాశాలలో ఏసీబీ అధికారుల సోదాలు
నారాయణపేట జిల్లా కేంద్రం సింగారం చౌరస్తా వద్ద గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల లలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు.
కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు అడ్మిషన్లు,మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూనికలు కొలతలు, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిట్ అధికారులతో కలిసి ఏసీబీ అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా భోజన సదుపాయాల కల్పనాల్లో నాణ్యత, పారిశుద్ధ్యం, వసతుల కల్పన, విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై పరిశీలించారు. పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ విషయముపై పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపడం జరిగిందని సంబంధిత అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.