
రైతు పై చేయి చేసుకున్న ఎస్సై.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో
మమహబూబ్ నగర్ : యూరియా కోసం జరుగుతున్న ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భాగంగా ఓ రైతు పై చేయి చేసుకున్న ఘటన శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది.
యూరియా కోసం తెల్లవారుజాము నుంచి విక్రయ కేంద్రాల వద్దకు చేరుకొని బారులు తీశారు. యూరియా బస్తాలు తక్కువగా ఉండడం..
రద్దీ ఎక్కువ కావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయడం, రైతుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితులు విషమించాయి.
ఈ నేపథ్యంలో మరికల్ ఎస్సై రాము తమ సిబ్బందితో పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఓ రైతు చెంపపై ఎస్సై కొట్టాడు.
ఈ ఘటనతో రైతులు పోలీసుల తీరు పై వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. యూరియా కోసం మమ్మల్ని చంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నానా తంటాలు పడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.