
బ్యాంకు ఉద్యోగం మీ కల.. అయితే మీ కోసం ఈ సువర్ణ అవకాశం
బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు టి-సాట్ ఫ్రీ ఆన్‌లైన్ కోచింగ్
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య వంటి అంశాలపై డిజిటల్ కంటెంట్ అందిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకు కూడా ప్రత్యేక డిజిటల్ కోచింగ్ ఇవ్వనున్నాయి.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐబిపిఎస్ (IBPS) పరీక్షలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రత్యేక ప్రసారాలు చేయడానికి షెడ్యూల్ సైతం ఖరారు చేశారు. ఈ వివరాలను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 10,227 బ్యాంకు ఉద్యోగాలు..
దేశ వ్యాప్తంగా మొత్తం 10,227 పోస్టులకుగానూ తెలంగాణకు 261, ఆంధ్రప్రదేశ్కు 367, కలిపి 628 ఉద్యోగాలు కేటాయించారని టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల యువతకు తగిన స్థానం దక్కించాలన్నదే టి-సాట్ లక్ష్యమని స్పష్టం చేశారు.
అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కాంపిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, పజిల్స్, పారా జంబుల్స్ వంటి ప్రధాన సబ్జెక్టులపై ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నారు.
సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 3 వరకు 35 రోజుల పాటు, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు 100 ఎపిసోడ్లు ప్రసారమవుతాయని వేణుగోపాల్ రెడ్డి వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎన్.ఎం.ఎం.ఎస్ ప్రత్యేక పాఠ్యాంశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల 8వ తరగతి విద్యార్థుల కోసం ఎం.హెచ్.ఆర్.డి ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎన్.ఎం.ఎం.ఎస్ (National Means-cum-Merit Scholarship) అర్హత పరీక్ష కోసం కూడా టి-సాట్ డిజిటల్ పాఠ్యాంశాలు అందిస్తోంది.
సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ వరకు విద్య ఛానల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అరగంట చొప్పున రెండు పాఠ్యాంశ భాగాలు, మొత్తం 100 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నారు.
ఇవి MAT (Mental Ability Test), SAT (Scholastic Aptitude Test) కి సంబంధించిన ప్రధాన సబ్జెక్టులపై ఉంటాయి. ఈ పాఠ్యాంశాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షలో ప్రతిభ కనబరిచి, ప్రభుత్వ స్కాలర్షిప్ పొందేందుకు సహాయపడతాయని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.