
కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల జేఏసీ, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి వెలిశాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు, ఎస్సీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు నేతలు ఆరోపించారు.
జిల్లాలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటోలు ఫ్లెక్సీలలో ముద్రించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ సంఘాలు తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేత రాజేందర్ రావు ఫ్లెక్సీని తగలబెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, వెంటనే వెలిశాల రాజేందర్ రావును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని ఎస్సీ దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.