
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి యువకుడి మృతి
విజయనగరం జిల్లాలోని బొబ్బాదిపేటలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా బొబ్బాది హరీశ్(22) అనే యువకుడు డీజే ముందు డ్యాన్స్ చేశాడు.
ఆ శబ్దానికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు అతడిని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
డిగ్రీ పూర్తి చేసిన హరీశ్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీశ్ ఇక లేడన్న సమాచారంతో బొబ్బాదిపేటలో విషాద చాయలు అలముకున్నాయి.
డీజేలను నిషేధించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.