
యూరియా కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన రైతులు
హుస్నాబాద్: యూరియా కోసం రైతులు గురువారం తెల్లవారుజాము నుండి వేచి చూసి చేసేదేమీ లేక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఎద్దు, ఎవుసం విడిచిపెట్టి యూరియా కోసం పడిగాపులు కాచిన దొరకడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకెన్ని రోజులు ఎదురుచూపులు చూడాలని రైతులు ఆక్రోషం వెళ్లగక్కారు. సాయంత్రం వస్తుందని వ్యవసాయ అధికారి, పోలీసులు కలిసి రైతులకు నచ్చ చెప్పినప్పటికీ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
కానీ యూరియా కావాల్సిందేనని రైతులు భీష్మించుకొని ఒక్కసారిగా క్యాంపు కార్యాలయం లోకి చొచ్చుకు వచ్చారు. వారిని ఆపడం కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
కాగా ఒక్కసారిగా క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన రైతులు ఎమ్మెల్యే క్యాంపు గేటు ముందు కూర్చుని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న సీఐ రైతులకు ఎంత నచ్చచెప్పినప్పటికీ రైతులు వినలేదు. దీంతో అధికారులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
సద్ది మూటతో రైతుల నిరసన..
యూరియా కోసం గేటు ముందు కూర్చున్న రైతులు సద్ది మూట ముందు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. యూరియా ఇచ్చేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని బైఠాయించారు.
ఇట్లా మేము ఎన్ని రోజుల వరకు యూరియా కోసం వేచి చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వస్తుందని ఖచ్చితమైన హామీ ఇచ్చి టోకెన్లు ఇవ్వాలన్నారు.
అక్కడికి చేరుకున్న ఎమ్మార్వో లక్ష్మారెడ్డి సిద్దిపేట జిల్లాకు 4 లోడ్లు వచ్చాయి. ఇందులో ఒకటి అక్కన్న పేట మండలానికి, మరొకటి హుస్నాబాద్ మండలానికి వచ్చాయని ఇక్కడ ఉన్న రైతులకు ఒకటి చొప్పున ఇస్తూ టోకెన్లు తీసుకోవాలని రైతులకు చెప్పారు.
రేపటి నుండి మాత్రం యూరియాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రైతులు కోరారు. అనంతరం రైతులు నిరసన విరమించి యూరియా కోసం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు యూరియా కోసం నిలబడ్డారు.