
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం..
నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఆనందంగా స్కూల్ బస్సు ఎక్కి, పాఠశాల రాగానే దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కనగల్ మండలం తొరగల్లు గ్రామానికి చెందిన చింత మల్ల సైదులు కుమార్తె జస్విత (5) నల్లగొండ పట్టణంలోని తొరగల్లు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది.
రోజు మాదిరిగానే ప్రైవేట్ స్కూల్ బస్సులో తమ గ్రామం నుంచి పాఠశాలకు బయల్దేరింది. బడి వద్దకు రాగానే జస్విత బస్సు దిగింది.
డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్షంతో బస్సును కదిలించడంతో జస్విత టైర్ల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐ వెంటేశ్వర్లు , తమ సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్ళి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.