
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి
హైదరాబాద్ నగరంలో అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాతబస్తీ యాకుత్‌పురాలో మూతతెరిచి వదిలిన మ్యాన్‌హోల్‌లో స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారి విద్యార్థిని పడిపోయిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజ్ మూతను తెరిచి వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు విద్యార్థిని తల్లి గమనించి వెంటనే బాలికను పైకి లాగి కాపాడింది. స్థానికులు కూడా అక్కడికి చేరుకుని సహాయం చేశారు. బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనతో మ్యాన్‌హోల్‌లు ఎంత ప్రాణాంతకంగా మారుతున్నాయో మరోసారి రుజువైంది.
తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ అనేకమంది ప్రాణాలు మ్యాన్‌హోల్‌లలో జారిపడి బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ – “మ్యాన్‌హోల్ మూతను ఎందుకు తెరిచి వదిలేశారు? ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టలేదు? వర్షం నీటికి మార్గం కల్పించేందుకని మూతలు తీస్తే, ప్రాణాల భద్రతను ఎవరు చూసుకోవాలి? చిన్నారి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టి, మ్యాన్హోల్ల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.