
భద్రాచలం దేవస్థానంలో ప్రమోషన్ కోసం లంచం ప్రయత్నం…
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/భద్రాచలం ప్రతినిధి,
సెప్టెంబర్ 11,
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఒక అధికారి పదోన్నతి కోసం లంచం ఇవ్వాలని చేసిన ప్రయత్నం వివాదానికి దారితీసింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది ?
సమాచారం ప్రకారం, భద్రాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి, ప్రమోషన్ కోసం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఫోన్‌పే ద్వారా కొంత మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఉద్యోగి లంచాన్ని తిరస్కరించడమే కాకుండా తిరిగి డబ్బును వెనక్కి పంపించి వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
పదోన్నతి కోసం లంచం వేరవేసిన అధికారికి ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రమేల…?
వేసిన వ్యవహారంలో అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయిన తర్వాత నాలుగు రోజులు గడవక ముందే ఆ అధికారికి ఉత్తమ ఉద్యోగి ప్రశంసా పత్రం ఇచ్చి సన్మానించడం వెనుక మాజీ ఈవో మనసులో ఉన్న మర్మమేమిటో తెలియక దేవస్థానం ఉద్యోగులే అవాక్కు అవటం కొసమెరుపు..
అధికారుల ప్రతిస్పందన
ఫిర్యాదు అందుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, సంబంధిత అధికారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటి దేవస్థానం ఈవో విచారణను ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం భద్రాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదర్ రావు ఈ సంఘటన పై స్పందిస్తూ –
“ విచారణకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. నిజంగా లంచం వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు రుజువైతే సంబంధిత ఉద్యోగిపై కఠినమైన శాఖపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షం విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. “ప్రజల భక్తి, నమ్మకాలకో కేంద్రంగా నిలిచిన భద్రాచలం దేవస్థానంలో అవినీతి ముసుగు పడటం విచారకరం. మూడు నెలలుగా ఈ ఫిర్యాదు పై చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని స్థానిక నేతలు విమర్శించారు.
భక్తుల ఆవేదన
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “దేవాలయంలో విధులు నిర్వహించే అధికారులే లంచం కోసం ప్రయత్నిస్తే దేవుని ఆలయ పవిత్రత ఎలా కాపాడబడుతుంది?” అని ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడడం, విచారణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం భక్తుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు కొత్త ఈవో ఆధ్వర్యంలో విచారణ జరగనుండటంతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయా? సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాలి.