
కుప్పకూలిన కలెక్టరేట్ బిల్డింగ్..
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం పైఅంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
సాయంత్రం వేళ ఈ సంఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష ఉండటంతో ఉద్యోగులంతా అందుబాటులో ఉన్నారు.
అదే సమయంలో కలెక్టరేట్ భవనం పై అంతస్తు కూలడం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. కాగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం పై అంతస్తు బలహీనపడి కూలిందా? అన్న చర్చలు కూడా మొదలయ్యాయి.

ఆదిలాబాద్‌కు ఐఎండీ హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, నిర్మల్ సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా మరికొన్ని జిల్లాలకు రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆయా జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయిన పేర్కొంది. మరో రెండు, మూడు రోజులు వర్షాల పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ భవనాలపై ఫోకస్..
వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాతబడిన ప్రభుత్వ భవనాల పరిస్థితిపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. అన్ని భవనాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం, మంత్రులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
భవనాలను పరిశీలించిన తర్వాత రిపేర్లతో సరిపోయే వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పనులను ముగించాలని, లైఫ్ అయిపోయిన భవనాల స్థానం కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.