
గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీలు.. వివిధ విభాగాల్లో 3,488 ఉద్యోగాలు..
తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థలు రాష్ట్ర విద్యా రంగంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ఇటీవల ఖాళీలను నేరుగా నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేసినప్పటికీ..ఇంకా సిబ్బంది కొరత కొనసాగుతోంది.
ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించిన గురుకుల విద్యా సంస్థల్లో పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3,488 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నియామకాలు నేరుగా కాకుండా ఔట్సోర్సింగ్ విధానంలో జరగనున్నాయి. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసి.. 31 విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించడానికి అనుమతి ఇచ్చారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా ఔట్సోర్సింగ్ నియమావళి ప్రకారం భర్తీ చేయబడతాయి.
గురుకుల విద్యాసంస్థలు విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు ఆహారం, వసతి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధి కల్పించడం లక్ష్యంగా పనిచేస్తాయి.
కానీ, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పాఠ్య ప్రణాళిక అమలులో ఆటంకాలు కలుగుతున్నాయి. అందుకే ఈ ఖాళీల భర్తీతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకుల పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. బోధనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయులతో పాటు నిర్వాహక సిబ్బంది పాత్ర కూడా ఎంతో కీలకం.
ఈ నియామకాలు పూర్తవడం ద్వారా విద్యా వాతావరణం మరింత బలోపేతం అవుతుంది. విద్యార్థులకు సమయానికి పాఠాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయ సేవలు అందించే అవకాశాలు పెరుగుతాయి.31 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
వాటిలో ప్రోగ్రామర్, సీనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు.. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీడీ పోస్టులు కూడా ఉన్నాయి.
అన్ని విభాగాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు అత్యధికంగా ఉన్నాయి. దాదాపు 1227 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లైబ్రేరియన్ పోస్టులు దాదాపు 43 ఉన్నట్లు తెలుస్తోంది. స్టాఫ్ నర్స్ పోస్టులు 42 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
ఈ పోస్టులకు అర్హత విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు.. బీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది. టెట్ లేదా సీటెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసి ఉండాలి.