
‘కాంతార చాప్టర్ 1’పై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్
హీరో రిషబ్ శెట్టి డైరెక్టర్ గా, హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ సినిమాకి డివైన్ బ్లాక్ బస్టర్‌గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక బుక్ మై షోలో రిలీజ్ రోజు సుమారు 1.28 మిలియన్‌కి పైగా టిక్కెట్లు బుక్ అయ్యయంటేనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతోంది.
భాషా వివాదంతో తెలుగు నాట ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చినా టాక్ బాగుండటంతో ఈ వివాదం పక్కకి వెళ్లిపోయింది. కంటెంట్ బాగుంటే వివాదాలు ఏం చేయలేవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
‘కాంతార చాప్టర్ 1’పై సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో రిషబ్‌శెట్టి కొత్తలోకానికి తీసుకెళ్లాడని, హీరోగానే కాకుండా దర్శకుడిగానే నూటికి నూరు మార్కులు సంపాదించాడని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన రామ్‌గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
‘కాంతార ఒక అద్భుతం. దేశంలోని అందరు చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి, అతడి టీమ్‌ని చూసి సిగ్గుపడాలి. కంటెంట్‌తో పాటు వారి కృషి ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. క్రియేటివ్ టీమ్ రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్‌ని అభినందించి తీరాలి.
రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను’ ట్వీట్ చేశారు ఆర్జీవీ. అయితే ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాన్ని చూసిన ఎవరైనా రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయాన్ని అంగీకరించక మానరు. సినిమాలతో అంత అద్భుతంగా నటిస్తూ అంతకంటే గొప్పగా డైరెక్షన్ చేయడం అనేది సామాన్య విషయం కాదు.
గతంలో మన తెలుగులో దాసరి నారాయణరావులో అలాంటి టాలెంట్ కనిపించేది. ఇంతటి టిపికల్ డివోషనల్ స్టోరీని టేకప్ చేయడంతో పాటు హీరోగా నటించి మెప్పించడం గొప్ప విషయం. ఈ విషయంలో రిషబ్‌శెట్టి తాను అందుకుంటోన్న ప్రశంసలకు పూర్తిగా అర్హుడే.
రిషబ్‌శెట్టి త్వరలోనే తెలుగులోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జై హనుమాన్’లో ఆయన ఆంజనేయుడిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే అనుకోని అవాంతరాలతో ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. మొత్తానికి ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే ఆర్జీవీ.. ‘కాంతార చాప్టర్ 1’పై చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.




