
న్యాయవాది CJIపై చెప్పులు విసిరేందుకు యత్నం! సుప్రీం కోర్టులో హై టెన్షన్..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌కి కోర్టు ప్రాంగణం లోనే దాడికి ఓ లాయర్ ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. సీజేఐ గవాయ్‌పై ఓ లాయర్ చెప్పు విసిరేందుకు ప్రయత్నించగా తోటి లాయర్లు అడ్డుకున్నారు.
ఈ హఠాత్ పరిణామంతో సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాదులు, న్యాయమూర్తులు సైతం షాకయ్యారు. ఇలాంటి పరిణామాలు తనపై ప్రభావం చూపలేవని ఈ ఘటన అనంతరం సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ కథనం ప్రకారం సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఇవాళ కేసుల ప్రస్తావన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది జడ్డీలు కూర్చునే పోడియం వద్దకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పైకి విసిరే ఉద్దేశ్యంతో తన షూను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
అయితే కోర్టు గదిలో ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అతన్ని అడ్డుకున్నారు. దీంతో సదరు న్యాయవాదిని ముందుకెళ్లకుండా అడ్డుకుని కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు.
సీజేఐ గవాయ్ పై బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ ను కోర్టు గది నుండి బయటికి తీసుకెళ్తుండగా.. అతను సనాతన్ కా అప్మాన్ నహి సహేంగే (సనాతన ధర్మానికి అవమానాన్ని తాము సహించం ) అని అరిచినట్లు తెలుస్తోంది.
అయితే ఈ గందరగోళం మధ్యే సీజేఐ గవాయ్ ఈ ఘటనపై స్పందించారు. కోర్టు హాల్లో ఉన్న వారు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు. ఇవన్నీ చూసి డిస్టర్బ్ కావొద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవన్నారరు.
దీంతో కోర్టులో కేసు విచారణ కొనసాగింది.ఈ ఘటనలో సీజేఐ గవాయ్ కు భౌతికంగా ఏమీ కానప్పటికీ.. సుప్రీంకోర్టులో భద్రత చర్చనీయాంశమైంది. దేశ అత్యున్నత న్యాయస్ధానంలో భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది.
అయితే ఇంత ఘటన జరిగినా సీజేఐ గవాయ్ మాత్రం సంయమనంతో వ్యవహరించడంపై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు హాల్లో ఉన్న వారికి సీజే చేసిన సూచనలపైనా చర్చ జరుగుతోంది.