
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
టికెట్ ధరల పెంపునకు వ్యతిరేకంగా RTC బస్సెక్కి BRS MLAలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్టాండ్ నుంచి అసెంబ్లీ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించి CM రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్ చార్జీల పెంపుతో ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రయాణికులకు వివరించారు. పేదలపై నెలకు రూ.5వందల వరకు అధనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి నినాదాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచితంగా ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల దగ్గర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపారని విమర్శించారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు పెంచారని వెల్లడించారు. మార్పు అంటే సామాన్య ప్రజలపై భారం మోపడమేనా అని ప్రశ్నించారు.
మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి గట్టి బుద్ధి చెప్పాలన్నారు. సామాన్య ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.