
తాగిన మైకంలో తండ్రిని కడతేర్చిన కొడుకు
తాగిన మైకంలో తండ్రిని కొడుకు చంపిన ఘటన షాబాద్ మండల పరిధిలోని దామర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దామర్లపల్లి గ్రామానికి చెందిన కమ్మరి సదానందం (52) తన భార్య సుజాతతో తరచూ గొడవపడుతుండేవాడు.
గత రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సదానందం, భార్యతో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అతని కుమారుడు నరేష్ ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు.
ఆపే ప్రయత్నంలో తండ్రి సదానందంతో నరేష్ వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్తా దాడికి దారితీసింది. నరేష్ తన తండ్రిని కొట్టగా తీవ్రంగా గాయపడిన సదానందం క్రిందపడిపోయాడు.
అనంతరం అతన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో భాగంగా పూర్తి సమాచారం కోసం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు తెలిపారు. నిందితుడు నరేష్ (30)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.