
ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
నల్లగొండ : హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు. హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్‌మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు.
ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి” అని అధికారి ఒకరు తెలిపారు.