
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులు రిమాండ్
ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుండి వయా డోర్నకల్ మీదుగా హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకుల్లో ఖమ్మం రూరల్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముస్కారాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాస్నా తండాకు చెందిన వాంకుడోత్ వీరన్న, రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వాస్కుల రాజు, హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన సాయిరాం, డోర్నకల్ మండలం మన్నెగూడెంకు చెందిన భూక్య రోహిత్ ఒడిశా నుండి గంజాయితో హైదరాబాద్‌కు బయల్దేరారు.
ఖమ్మం రూరల్ ఎస్ఐ రాజారాం తన సిబ్బందితో కాసనా తండా, వాల్య తండా తదితర ప్రదేశాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
కస్నా తండా వై జంక్షన్ వద్దకు చేరుకునే సమయంలో ఆ నలుగురు యువకులు మద్యం తాగుతూ అనుమానాస్పదంగా పెట్రోలింగ్ సిబ్బందికి కనిపించారు. యువకుల దగ్గరకు పోలీస్ సిబ్బంది వెళ్తున్న సమయంలో గమనించిన భూక్య రోహిత్ అక్కడి నుంచి పారిపోయాడు.
మిగిలిన ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. తనిఖీ చేయగా రెండు కేజీల గంజాయి పట్టుబడింది. సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించి సదరు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.