
ఐసీయూలో శ్రేయాస్ అయ్యర్.. తీవ్ర రక్తస్రావంతో అడ్మిట్..!
టిమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయాస్ సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. బ్యాక్వర్డ్ పాయింట్లో రన్నింగ్ క్యాచ్ అందుకున్న శ్రేయాస్ ఆ క్రమంలో కిందపడ్డాడు.
అయితే డైవ్ చేస్తున్న సమయంలో.. అతని మోచేయి పక్కటెముకలను బలంగా నెట్టింది. దీంతో రిబ్స్‌లో అతనికి గాయమై రక్తస్త్రావం జరిగినట్లు తెలుస్తోంది. బ్లీడింగ్ అధికంగా ఉండడంతో.. అతన్ని సిడ్నీ ఆస్పత్రిలో చేర్పించారు.
గత రెండు రోజుల నుంచి శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో ఉన్నాడని, నివేదికల ఆధారంగా అతనికి ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతున్నట్లు గుర్తిమచామని, తక్షణమే అతన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
అయితే కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే అయ్యర్ చికిత్స జరగనున్నది. రికవరీ ఆధారంగా అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్లీడింగ్ వల్ల జరిగే ఇన్ఫెక్షన్ను అడ్డుకునేందుకు ఐసీయూ చికిత్స తప్పనిసరి అని పేర్కొన్నారు.
అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న తర్వాత అయ్యర్ గాయంతో డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.
అయితే అతని వైటల్ పారామీటర్స్ అన్నీ క్రమంగా ఒడిదిడుకులకు లోను అవుతున్నట్లు బీసీసీఐ మెడికల్ బృందం గుర్తించింది. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి పంపారు.
టీమ్ డాక్టర్, ఫిజియో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా అతన్ని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కానీ ఆ గాయాన్ని విస్మరిస్తే, శ్రేయాస్ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదన్నారు.
అయ్యర్ కనీసం మూడు వారాల పాటు క్రికెట్‌కు దూరం అవుతాడని భావిస్తున్నారు. ఒకవేళ రికవరీ ఆలస్యంగా జరిగితే, అప్పుడు మరింత లేటు జరిగే ఛాన్సు ఉన్నది. వారం రోజుల తర్వాత అతను సిడ్నీ నుంచి ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.



