
తహశీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన VAO
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామపరిపాలన అధికారి (VAO) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలోని బృందం ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఈ దాడి నిర్వహించింది.
గ్రామ పరిపాలన అధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెంకు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మొత్తం రూ. 60 వేలు లంచం డిమాండ్ చేశాడు.
అప్పటికే రూ. 40 వేలు తీసుకున్న శ్రీనివాస్ నాయక్ సోమవారం మిగిలిన బ్యాలెన్స్ రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పట్టుబడిన శ్రీనివాస్ నాయక్ గతంలో బూర్గంపాడు మండలంలో వీఆర్వో (VRO)గా పనిచేశాడని, ఆ సమయంలో కూడా ఇతని పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఇతని పై కేసునమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.



