
ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ.. ఎమ్మెల్యేను తరిమేసిన జనం..!!
చేవెళ్ల ప్రమాదం వెనుక, 24 మంది మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
వీరికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. కాగా, ఘటనా ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేలను స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమేసారు. ఈ ప్రమాదం వేళ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు.
బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగటంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్ లోని కంకర బస్సులో పడడంతో ముందు వరుసలో ఉన్న 5 సీట్లు డ్యామేజ్ అయ్యాయి.
అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి.. గాయపడిన 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి కాసేపట్లో సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది తాండూరు ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది.
ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. అనేక సార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పిన నిరక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. స్థాని కులు నిరసన తెలపడంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్లిపోయారు.
కాగా..సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. రంగారెడ్డి ప్రమాద తీవ్రతపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్న సీఎం కీలక సూచనలు చేసారు.
సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేసిన సీఎస్ సమాచారం సేకరిస్తున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణాకమిషనర్, ఫైర్ డీజీకి ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్‌రూమ్ నంబర్లు 99129 19545, 94408 54433 గా వెల్లడించారు.



