
కడప నుంచి వరల్డ్ కప్ దాకా..
పేదరికం ఆమెను ఆపలేదు..
శ్రీచరణి అసాధారణ ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రమల్లె గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి.. భారత మహిళల జట్టులో మెరిసింది. ICC Women’s Cricket World Cup 2025లో భారత్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
మారుమూల పల్లెటూరు నుంచి రికార్డు సృష్టించిందామె. పేదరికం, కష్టాలు… అన్నిటినీ ఎదురించి దేశానికే గర్వంగా మారింది. ఐసీసీ మహిళల విభాగంలో భారత్‌కు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించింది. ఆమెనే మహిళా క్రికెటర్ శ్రీ చరణి…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ, ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి. శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ప్రపంచ కప్‌లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.
21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ క్రికెట్‌లోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది. వాస్తవానికి క్రికెట్ ఆమె మొదటి లక్ష్యం కాదు. చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపింది.
అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆమె క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం.
ఆమె క్రికెట్‌ను ఎంచుకోకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు.
తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. చరణి చెప్పిన ప్రకారం.. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.
క్రీడా జీవితం ప్రారంభంలో శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్‌లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్‌ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా మారింది.
కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక కావడం ఆమె అచంచలమైన పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఆర్థిక కష్టాలు ఆమె ఆశయాన్ని ఆపలేకపోయాయి.



