
వికలాంగులైన పిల్లలను చం*పేసిన కసాయి తండ్రి…
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడిగా మారితే…
కరీంనగర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. వికలాంగులైన చిన్నారులపై దారుణానికి ఒడికట్టాడు ఓ కసాయి తండ్రి. కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు.
ఏకంగా వారి ప్రాణాలను తీసేందుకు సిద్ధపడ్డాడు. వికలాంగులుగా పుట్టడమే వారు చేసిన పాపమైపోయింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా.. ఆమె సోదరుడు ప్రాణాలతో బయటపడి చికిత్సపొందుతున్నాడు.
కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం, పోశవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల స్వగ్రామం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట. అయితే, ఉపాధి నిమిత్తం వారిద్దరూ తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడేళ్ల కిందట కరీంనగర్ వావిలాలపల్లికి వెళ్లారు.
అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మల్లేశం, పోశవ్వ దంపతుల కుమార్తె, కుమారుల పేర్లు అర్చన, అశ్రిత్. వారిద్దరూ మానసిక వైకల్యంతో జన్మించారు.
చిన్నారులను ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఆరోగ్య పరిస్థితి బాగుపడలేదని మల్లేశం తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతను వారిని చంపేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
అయితే, శనివారం సాయంత్రం భార్య మార్కెట్కు వెళ్లిన సమయంలో చిన్నారుల ప్రాణాలు తీసేందుకు నిర్ణయించుకున్నాడు మల్లేశం. ఆమె బయటకు వెళ్లిన వెంటనే అర్చనకు ఉరివేయగా.. విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది.
కుమారుడు అశ్రిత్ను సైతం చంపేందుకు యత్నిస్తుండగా.. భార్య ఇంటికి వచ్చింది. అలికిడి విన్న మల్లేశం అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడకపోయినా.. వారిని చంపే హక్కు ఎవరిచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



