
బతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను.. అంటూ ఓ తండ్రి ఆవేదన
బతికున్నప్పుడు తింటి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో స్మశాన వాటికలోనే 8 గంటలుగా కూర్చొని తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో బాలరాజ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న పత్తి మిల్లులో బాలరాజ్ పని చేసేవాడు.
ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో, భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది భార్య.
బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి కుమారుడు హరీశ్(8) చనిపోయాడు.
కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక, స్మశానంలో మృతదేహాన్ని పట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ కూర్చున్నాడు తండ్రి బాలరాజ్. బతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.



