
బిఆర్ఎస్ తో నాకెలాంటి సంబంధం లేదు : కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ పార్టీపై, తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుట్ర చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని, ప్రస్తుతానికి కొత్త పార్టీ ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తనను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని తెలియజేశారు.
రాజకీయ పార్టీ గురించి ఇప్పుడప్పుడే ఆలోచన చేయటం లేదని కవిత అన్నారు. బీఆర్ఎస్‌లో నుంచి తనను సస్పెండ్ చేశారని.. ఆ పార్టీతో తనకెటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కుట్రతో బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది కుట్ర చేసి తనను.. తన కుటుంబాన్ని బీఆర్‌ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు. తన జీవితంలో చిన్న పొరపాటు కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని విమర్శించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరావును బీఆర్ఎస్ వదులుకోవడంతోనే మూడోసారి అధికారంలోకి రాకుండా పోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. తుమ్మల బయటకు వెళ్లడంతోనే రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి తలకిందులైందన్నారు.
తుమ్మల లాంటి నేతను బీఆర్‌ఎస్ వదులుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పే అని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం ఫెయిల్ అయ్యిందని.. తన బాధ్యతను నిర్వర్తించలేకపోతోందని వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను భవిష్యత్తులో తాము పోషించబోతున్నామన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు ఎక్కడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని.. కనీసం ఒక టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌లో జాగృతి కార్యకర్తలకు అన్యాయం చేశారని… కనీస గుర్తింపు ఇవ్వలేదని కవిత సంచలన కామెంట్స్ చేశారు.
కవిత ఇంకా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా ఖమ్మం జిల్లా అని జాగృతి అధ్యక్షురాలు అన్నారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా మారిపోయిందని గుర్తుచేశారు.
వెంగళరావు హయాంలో జిల్లా విశేషంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆ తరువాత పెద్దలు తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు.
ఖమ్మం అభివృద్ధి కోసం ఎవరి ప్రయత్నం వారు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. ఇంకా ఖమ్మం అభివృద్ధి చెందాల్సి ఉందని.. సీతారామ ప్రాజెక్టును కూడా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సామాజిక తెలంగాణ రావాలన్నదే తన ఆశయమని.. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు రావాలని.. అన్ని వర్గాలకు అధికారం అందాలని ఆకాంక్షించారు. బీసీలకు భిక్షం వేయొద్దని.. బిక్షం వేస్తే తీసుకోవడానికి వాళ్ళు బిచ్చగాళ్ళు కాదన్నారు. బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలిపోతారని.. నూటికి నూరు శాతం బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
జమలాపురం టెంపుల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జమలాపురం ఆలయంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడులో సామినేని రామారావు దారుణ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
రామారావు హత్యపై డీజీపీని కలువనున్నట్లు కవిత తెలిపారు. హత్యా రాజకీయాలు సరికాదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి భవన్‌ను ముట్టడించబోతున్నామని ప్రకటించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించి రైతాంగానికి సాగు నీరు అందించాలన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి వచ్చే వరకు వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. సీసీఐతో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు లేకపోవడం పెద్ద తప్పు . ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ వదులుకోవడమే బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణమని కవిత అన్నారు.
తుమ్మల లాంటి నేతను దూరం చేసుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పని అన్నారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అని ఆమె తెలిపారు. అనంతరం జాగృతి కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.



