
గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి..
మహిళా వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో గ్యాస్ పేలి మహిళ మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే జూబ్లీహిల్స్ రహమత్ నగర్ , కమాన్ గల్లీ లోని గోపాల్ సింగ్ , లలితా బాయ్ కుమార్తె సోను బాయ్ (40) ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సోను బాయ్ (40) వంటగదిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై , ఒక్కసారిగా మంటలు వ్యాపించి గ్యాస్ పేలింది. గ్యాస్ పేలడంతో పక్కనే ఉన్న సోను బాయ్ అక్కడికక్కడే మృతి చెందింది.
పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గోపాల్ సింగ్ , లలిత సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మహిళ మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం వారి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటన పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



