
మంట కలిసిపోతున్న బంధుత్వాలు
భూ వివాదంలో అక్క కుటుంబంపై తమ్ముడు దాడి
సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన రణబోతు జ్యోతికి గ్రామ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలాన్ని ఇదే గ్రామానికి చెందిన వారికి కౌలుకి ఇచ్చింది.
రణబోతు జ్యోతి, ఆమె కుమార్తెలు ఇద్దరు, భర్త రాంరెడ్డి, పొలం కౌలుదారులు పంట పొలం కోయటానికి హార్వెస్టర్ మిషన్‌తో కలసి పొలం వద్దకు వెళ్లారు.
పంట కోయటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడకు ఆమె తల్లి, తమ్ముడు అయిన దొంతిరెడ్డి కళావతి, ఉపేందర్ రెడ్డి మరొక ట్రాక్టర్‌తో అక్రమంగా జ్యోతి భూమిలోకి ప్రవేశించి, ట్రాక్టర్‌తో హార్వెస్టర్ మిషన్‌ను ఢీకొట్టి మిషన్ రేడియేటర్‌ను డ్యామేజీ చేశారు.
ఈ క్రమంలో అడ్డువెళ్ళిన రణబోతు జ్యోతి, ఆమె ఇద్దరు కుమార్తెలు, జ్యోతి భర్త రాంరెడ్డిపై దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురిచేశారు.
తమ ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు రణబోతు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దొంతిరెడ్డి కళావతి, ఆమె కొడుకు ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.




