
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది.. మాజీ మంత్రికి కవిత వార్నింగ్
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోద్దని బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. ”తండ్రి వయసున్న వ్యక్తి అని ఇన్నాళ్లూ నిరంజన్‌రెడ్డిని గౌరవించాను. కానీ ఆయన నాపై ఇష్టమున్నట్టు విమర్శలు చేస్తున్నారు. సచ్చు వంకా య, పుచ్చు వంకాయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తనను ఉద్దేశించి పుచ్చువంకాయ, సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట.. ఇన్నాళ్లు మీ వయసుకు గౌరవించాను. ఇంకో సారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనుషులను పెట్టించి నాపై మాట్లాడిస్తున్నా చాలా రోజులుగా మౌనంగా ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన ఆరోపణలపై సమాధానాలు ఇవ్వాలన్నారు. నా గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నిరంజన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్ కు తెలియదా? లేదా ఈ అవినీతి కేసీఆర్ వరకు వెళ్లకుండా హరీశ్ రావు కాపాడారా అని నిలదీశారు.
నిరంజన్ రెడ్డి అవినీతి కేసీఆర్ కు ఇప్పటి వరకు తెలియదనే తాను అనుకుంటున్నానని ఇవాళ మీడియా ముఖంగా నిరంజన్ రెడ్డి అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నానని ఇక్కడ ఏ చిన్న పిల్లాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకలు చెబుతున్నారని అన్నారు.
నిరంజన్ రెడ్డి లాంటి నాయకులను ప్రజలమీద రుద్ది ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని కవిత ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి లాంటి మనుషులు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. నిరంజన్ రెడ్డి బీసీలు, ఉద్యమకారులపై పెట్టిన కేసుల గురించి బాధితులు చెప్పుకుంటూ బాధితులు ఏడుస్తున్నారన్నారు.
ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ఇందులో అసైండ్ భూములు కూడా ఉన్నాయని, కృష్ణా నది కాలువ ఆయన ఫామ్ హౌస్ లోనుంచి వెళ్తోందని చెబుతున్నారన్నారు.ఈ బీఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని అయినా ఉద్యమాకారులు ఆ పార్టీలో ఉండలేక మింగలేక చస్తున్నారని చెప్పారు.
హరీశ్ రావు మనిషి కాబట్టే చర్యలు లేవు : నిరంజన్ రెడ్డి స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని కాలబెడుతుంటే కూడా చూస్తూ ఉండిపోయారట. ఈ విషయం నిజంగా కేసీఆర్ కు తెలిసి కూడా మౌనంగా ఉంటే మాత్రం ఇది వంద శాతం తప్పు అవుతుందన్నారు.
ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ఇంక ఘోరంగా మిమ్మల్ని ఓడించాల్సిందన్నారు. ప్రజా సమస్యలపై నేను మాట్లాడుతుంటే మీకెందుకు భయం అవుతోందని మండిపడ్డారు. భూదహానికి, ధనదాహానికి హద్దు ఉండాలి కదా అన్నారు.
నిరంజన్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీ మధ్య ఉన్న అవగాహన ఏమిటి అని ప్రశ్నించారు. హరీశ్ రావు మనిషి కావడం వల్లే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తాను బలంగా నమ్ముతున్నానన్నారు.



