
జిల్లాలో ఇద్దరు వివాహితలు ఆత్మహత్య
వేర్వేరు కారణాలతో ఇద్దరు వివాహితలు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శుక్రవారం జరిగాయి. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని పూసల తండాకు చెందిన గుగులోతు నవీన్ కు గుగులోత్ సరిత(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. కాగా నవీన్ ఆర్మీలో జవాన్ గా విధులు నిర్వహిస్తుండగా సరిత ఇంటివద్దె ఉంటుంది. నెలల తరబడి ఒంటరిగా ఉండడంతో మనోవేదనకు గురై ఈ నెల 25వ తేదీన గడ్డి మందు తాగింది.
చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం సరిత మృతి చెందింది. మృతురాలి సోదరుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
మరో ఘటనలో మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండాకు చెందిన గుగులోతు సరోజ (45) కొంతకాలంగా పక్షవాతం వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అనేకమార్లు ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఫలితం కనిపించలేదు.
దీంతో మనోవేదనకు గురైన సరోజ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి 108 లో మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సరోజ మృతి చెందింది. భర్త కాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.




