
జిల్లాలో పోలీసుల కాల్పుల కలకలం… అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి..
నెల్లూరు జిల్లాలో అకస్మాత్తుగా జరిగిన పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. జిల్లాలోని కోవూరు సమీపంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
అయితే కొందరు దుండగులను పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లు తెలియ వస్తోంది. ఈ ఘటనలో ఓ నిందితుడితో పాటు ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడినట్లు తెలుస్తోంది. మరికొందరు సంఘటనా స్థలం నుంచి పారిపోయారని సమాచారం.
పోలీసుల వర్గాల వివరాల ప్రకారం జిల్లాలోని కల్లూరుపల్లి హౌజింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతని నివాసం వద్ద అంతా నిర్మానుష్యంగా ఉంది. అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు గుట్టు చప్పుడు కాకుండా పెంచలయ్య ఉంటున్న దగ్గరకు చేరుకున్నారు.
అతనిపై దాడి చేసి గాయపరిచారు. ఆ దాడిలో పెంచలయ్య తీవ్రంగా గాయపడినాడని.. అనంతరం మరణించాడని పోలీసుల కథనం. ఈ హత్యకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు.
ఘటనా స్థలానికి చేరుకొని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. పరిశీలన అనంతరం హత్యగా నిర్ధారించుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నిందితులు పరారయ్యే క్రమంలో కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక టీంగా పోలీసులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులకు దుండగులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో దుండగుల పోలీసులపై దాడికి దిగారు. పదునైన వస్తువుతో పోలీసులపై దాడి చేయడం మొదలుపెట్టారు. అనుకోని ఈ దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని నిలువరించేందుకు బాహాబాహీకి దిగారు.
ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. కానిస్టేబుల్ గాయపడడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులకు పని చెప్పారు. దుండగులపై కాల్పులను ప్రారంభించారు. పోలీసుల కాల్పుల్లో జేమ్స్ అనే దుండగుడి కాలికి గాయమైంది.
పోలీసుల తుపాకుల దాడితో బెంబేలెత్తిపోయిన ఇతర దుండగులు అక్కడి నుంచి పరుగు లంకించుకుని పారిపోయారు. పారిపోయిన వారి దుండగుల కోసం పోలీసులు తదుపరి గాలింపు చర్యలు చేపట్టారు.
హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న జేమ్స్ తో పాటు దుండగుల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఆదినారాయణను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



