
దమ్ముంటే రాజీనామా చెయ్.. జగిత్యాల ఎమ్మెల్యేకు కోరుట్ల ఎమ్మెల్యే సవాల్
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డా. సంజయ్ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న చందంగా కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ సంజయ్ యూజ్ లెస్ ఫెలో అంటూ ఫైర్ అయ్యారు. కాంట్రాక్టులు, బిల్లులు తప్ప ఆయనకు మరేం తెలియదు అన్నారు. కోరుట్ల పేషంట్లు జగిత్యాల వస్తున్నారని అంటున్నాడని, జగిత్యాల తమ జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పారు.
జగిత్యాల ఆత్మగౌరవాన్ని డా. సంజయ్ తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. తప్పకుండా కోరుట్ల ప్రజలు జగిత్యాల ఆస్పత్రులకు వస్తారని అన్నారు.
మీరు హైదరాబాద్ వెళ్లి నడుం నొప్పికి చూపించుకోవడం లేదా అని ప్రశ్నించారు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ జగిత్యాల అన్నారు.
కేసీఆర్ ను మోసం చేశావంటే ప్రజలను కూడా మోసం చేసినట్టే అన్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదని, దమ్ముంటే రాజీనామా చేయాలని అన్నారు.
రాజీనామా చేస్తే తాను కూడా కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాలలో పోటీ చేస్తానని చెప్పారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు రెండేళ్లుగా నత్తనడకన నడుస్తుంటే ఏం చేస్తున్నావు..? అని ప్రశ్నించారు.




