
ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగంలో గర్భిణీ మృతి చెందింది.
రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) ప్రసవం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చేరగా ఆమెకు బుధవారం ఆపరేషన్ చేశారు.
అనంతరం కొద్ది సేపటికి ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వైద్యం వికటించి సాగరమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాన్పు కోసం ఈ నెల 14న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా రక్తం తక్కువగా ఉందని నరసరావుపేటకు వెళ్లాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు అదే రోజు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆపరేషన్ చేసి మగ బిడ్డను బయటకు తీసిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయినట్లు సాగరమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినదని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. ఇటీవల నరసరావుపేటకు చెందిన మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె శరీరంలో సర్జికల్ బ్లేడు వదిలేశారు.
దీంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్ లో వరుసగా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.


