
పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..!
కూసుమంచి/పాలేరు : రాజకీయం అంటే కేవలం పదవులు… అధికార దర్పం మాత్రమే కాదు.. అంతకు మించిన ఆత్మీయ అనుబంధమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరూపించారు.
పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ… తన వెన్నంటి నడిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి అకాల మరణం ఆయన్ని తీవ్రంగా కలచివేసింది. శనివారం పాలేరులో జరిగిన రామిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్న తీరు అక్కడున్న వేలాది మంది కళ్లను చెమర్చింది.
అధికార హోదా మరచి..
అంత్యక్రియల సందర్భంగా మంత్రి పొంగులేటి తన ప్రోటోకాల్‌ను పక్కన పెట్టారు. తన ప్రియతమ అనుచరుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ మంత్రి స్వయంగా పాడే మోశారు.
సాధారణ కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి శ్మశాన వాటిక వరకు నడిచి తనపై ఉన్న అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు.
ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా, తన అనుచరుడి కోసం పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు పలకడాన్ని చూసి పాలేరు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు.
పాలేరు శోకసంద్రం…
సీనియర్ నాయకుడు రామిరెడ్డి మృతితో పాలేరు గ్రామం మౌన రోదనతో నిండిపోయింది. వేలాదిగా తరలివచ్చిన జనవాహిని మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
“పార్టీ ఒక నిబద్ధత గల సీనియర్ నాయకుడిని కోల్పోయింది. నా రాజకీయ ప్రయాణంలో రామిరెడ్డి పాత్ర మరువలేనిది” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.



