
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి.. వార్డు మెంబర్‌కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు
Social media : ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఒకవైపయితే… తాను పంచిన వస్తువులు తిరిగివ్వాలని ఓ అభ్యర్థి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రామరెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది.
అభ్యర్థి ఆగ్రహం.. ఉప్పల్వాయి గ్రామంలోని రెండో వార్డు నుంచి వార్డు మెంబర్‌గా పోటీ చేసిన ఒక అభ్యర్థి, ప్రచారం సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఖర్చు చేశారు. వార్డులోని మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిళ్లను పంపిణీ చేసి, తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు.
అయితే, ఫలితాలు వెలువడగా సదరు అభ్యర్థి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆయన, గ్రామస్తులపై ఆగ్రహంతో ఊగిపోయారు.
ఓడిపోయిన మరుసటి రోజు నుండే ఆ అభ్యర్థి తన వార్డులోని ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టారు. ‘నేను పెట్టిన ఖర్చుకు నాకు ఓట్లు పడలేదు.. నేను ఇచ్చిన వస్తువులను నాకు తిరిగి ఇచ్చేయండి’ అంటూ ఓటర్లను డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో గొడవకు దిగి, దుర్భాషలాడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి ఇలా వీధి రౌడీలా ప్రవర్తించడం చూసి గ్రామస్తులు విస్తుపోయారు.
తిప్పి కొట్టిన మహిళా లోకం.. అభ్యర్థి వైఖరితో విసిగిపోయిన రెండో వార్డు మహిళలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అడిగినట్లుగానే తాము తీసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేయాలని నిశ్చయించుకున్నారు.
అందరూ ఏకమై, ఆయన పంపిణీ చేసిన చీరలను, మద్యం బాటిళ్లను సేకరించి నేరుగా అభ్యర్థి వద్దకు తీసుకువెళ్లారు. ‘నీ చీరలు మాకొద్దు.. నీ మద్యం మాకొద్దు’ అంటూ ముఖం మీదే విసిరేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో అభ్యర్థి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. డబ్బుతో, వస్తువులతో ఓట్లను కొనాలనుకోవడం తప్పు అని, ఓడిపోయిన తర్వాత ఇలా నీచంగా ప్రవర్తించడం మరీ దారుణమని మహిళలు మండిపడ్డారు.
ప్రస్తుతం ఈ సంఘటన ఉప్పల్వాయి గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసే అభ్యర్థులకు ఇదొక గుణపాఠమని స్థానికులు చర్చించుకుంటున్నారు.



