
అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి….
తిరుపతి జిల్లాలో ఓ కారులో మృతదేహం లభ్యంకావడం తీవ్ర కలకలం రేపుతోంది. జూపార్క్ రోడ్డులో ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా హాస్పిటల్‌కు తరలించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోఅసోసియేట్ ప్రొఫెసర్ మృతి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు.
పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్ట్‌లు జరిగాయి కూడా. తాజాగా ఆ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తండ ధర్మారంకు చెందిన సర్దార్ నాయక్ ఎస్వీవర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసరుగా ఉన్నారు.
గడిచిన రెండు రోజులుగా ఆయన తన నివాసానికి రాలేదు. దీంతో ప్రొఫెసర్ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం గాలించారు.
కారులో విగత జీవిగా ప్రొఫెసర్ సర్దార్ నాయక్
ఎలాంటి ఫలితం లేకపోవడంతో శుక్రవారం వేకువజామున ప్రొఫెసర్ మృత దేహాన్ని ఆయన కారులో స్థానికులు గుర్తించారు.
సర్దార్ నాయక్ కారులో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఆధారాలను సేకరించారు.
సర్దార్ మరణించి ఎక్కువ రోజులు కావడంతో శరీరం తీవ్రమైన దుర్వాసన వచ్చింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కావడంతో పూర్తి సేకరిస్తున్నారు పోలీసులు.
యూనివర్సిటీలో ఏమైనా ఘటనలు జరిగాయా? ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.



