
గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్ను చితకబాదిన వార్డెన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్లో వార్డెన్ భవాని ఒక విద్యార్థినిని విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవాని కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియోలో తీశారు. గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎగ్జిట్ అయి చెప్పి పోయినవ్ కదా హాస్టల్లో.. ఎగ్జిట్ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్ అయిపోయే టైం హాస్టల్ ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్ ఓ వైపు కర్రలు, మరోవైపు చేతులతో విద్యార్థినిని చితకబాదింది. సోషల్ మీడియాలో వార్డెన్ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇదే ఎస్సీ హాస్టల్ వార్డెన్ రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్తల్లో నిలిచింది. తాజా ఘటన నేపథ్యంలో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల నిరసన చేపట్టారు. విద్యార్థిని పట్ల దారుణంగా వ్యవహరించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్ పై సస్పెన్షన్ వేటు
డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన ఘటనలో వార్డెన్ భవానిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు
వార్డెన్ పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని DWOకి కలెక్టర్ ఆదేశం



