
🔴 ఘటనకు కారణమైన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి : గుగులోత్ వీరేష్ నాయక్, LHPS జిల్లా అధ్యక్షులు
🔴 ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి.(2.1.2026)
జనగామ జిల్లా, కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ లో ధరావత్ ప్రభాకర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎల్‌హెచ్‌పీఎస్ జనగాం జిల్లా అధ్యక్షులు గుగులోత్ వీరేష్ నాయక్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్టీ హాస్టల్లో వార్డెన్ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.
సరైన సమయంలో విధుల్లో హాజరు కాకపోవడమే కాకుండా, బయట నుంచి వచ్చిన ఇతర విద్యార్థులు హాస్టల్లో నివసిస్తున్న గిరిజన విద్యార్థులపై దాడి చేయడం అత్యంత అమానుష చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన గిరిజన విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే హాస్టల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దాడిని నిరసిస్తూ రేపటి రోజున గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ ఘటనపై లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు గుగులోత్ వీరేష్ నాయక్ వెల్లడించారు.
గిరిజన విద్యార్థుల ప్రాణ భద్రతకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



