
డాక్టర్ నిర్లక్ష్యంతోనే శిశువు మృతి.. ఆస్పత్రి వద్ద ఆందోళన
శిశువు మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆందోళన చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం సిటీ ముస్తఫానగర్ కు చెందిన పుట్టా లావణ్య, సుబ్బారావు దంపతులకు తొమ్మిదేండ్ల కింద పెండ్లైంది.
గత నెల 30న గాంధీ చౌక్ లోని హరిత తల్లి పిల్లల ఆస్పత్రిలో లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆస్పత్రి బిల్లు రూ. 50 వేలు చెల్లించి అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఉదయం శిశువుకు శ్వాస ఆడకపోవడంతో లావణ్య తల్లి గంజి వెంకటలక్ష్మి హరిత ఆస్పత్రి పిల్లల డాక్టర్ రమేశ్వద్దకు తీసుకెళ్లింది. శిశువుకు వైద్యం చేయాలని అక్కడ సుమారు 2 గంటల పాటు ఆమె ప్రాధేయపడింది.
అయితే.. ఆస్పత్రిలో వెంటిలేటర్ లేదని చెప్పినా వినకపోవడంతో ఆమెపై డాక్టర్ రమేశ్ చేయి చేసుకుని, రూ.100 ఇచ్చి ఆటోలో ఎంసీహెచ్ కు పంపించారు.
అక్కడికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. హరిత ఆస్పత్రి డాక్టర్ సమయానికి వైద్యం చేయకపోవడంతోనే శిశువు చనిపోయాడని ఆస్పత్రిలో బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు.
ఖమ్మం త్రీ టౌన్ సీఐ మోహన్ బాబు వెళ్లి ఆస్పత్రి మేనేజ్మెంట్పాటు బాధిత కుటుంబానికి సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బాధిత కుటుంబం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ చెప్పారు.



