
‘అందరివాడు’ కు ఆత్మీయ సన్మానం
-ఆర్యవైశ్య మహాసభ వేదికగా సేవా సంకల్పం
-టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తికి సత్కారం
ఖమ్మం, జనవరి 5
ఖమ్మం గుట్టల బజార్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవ్యాలయం ప్రాంగణంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం, అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సమాజానికి చెందిన నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో సభకు విశేష ప్రాధాన్యత లభించింది. ఐక్యతే బలమనే భావన సమావేశమంతా ప్రతిధ్వనించింది.
సమావేశంలో ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ఆర్యవైశ్య చైర్మన్లు, వార్డు సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్, జూబ్లీ క్లబ్, వివిధ దేవాలయాల పాలకవర్గాలకు ఎన్నికైన ఆర్యవైశ్య ప్రతినిధులను వేదికపై ఘనంగా సత్కరించారు.
బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలకంటే సమాజ హితానికే ప్రాధాన్యం ఇవ్వాలని, సమిష్టి కృషితోనే ఆర్యవైశ్య సమాజానికి గౌరవం పెరుగుతుందని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్ | హెచ్-2843) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తిను ఆహ్వానించి, ‘అందరి వాడు’ గా గుర్తింపు పొందిన ఆయనను సభ వేదికపై ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు.
నిష్పక్షపాత జర్నలిజంతో ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి స్వరంగా నిలుస్తున్న ఆయన సేవలను కొనియాడుతూ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. బాధ్యతాయుతమైన మీడియా ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
అనంతరం ఆర్యవైశ్య మహాసభ భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపారు. సేవా కార్యక్రమాల విస్తరణ, యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం, సాంస్కృతిక విలువల పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటూ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగాలని తీర్మానించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.



