
వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి
హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
Web desc : ప్రసవానికి వచ్చిన గర్భిణి అకస్మాత్తుగా మృతి చెందడంతో కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న అశ్విని హాస్పిటల్ వద్ద ఆదివారం మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు.
వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన నాగేంద్ర భార్య వెంకటేశ్వరి (22) గర్భం దాల్చిన అనంతరం అశ్విని హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటోంది.
నెలలు నిండటంతో కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం ఆమెకు సైలెన్ బాటిల్ పెట్టిన అనంతరం కొద్దిసేపటికే కింద పడింది. వైద్యులు చికిత్స చేస్తుండగా అప్పటికే ఆమె మృతి చెందింది.
దీంతో వెంటనే సిజేరియన్ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. వెంకటేశ్వరి మృతి చెందిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పి బిడ్డను చేతికిచ్చారు.
అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఆసుపత్రి ఎదుట ప్రజాసంఘాలతో కలిసి కొన్ని గంటల పాటు మృతదేహంతో బైఠాయించారు.
వైద్య చికిత్సలో తమ పొరపాటేమీ లేదని, ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, ఆ పరిస్థితుల్లో ఆమెకు సీపీఆర్ చేసి, ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి రక్షించే ప్రయత్నం చేశామని, అయినా ఆమె కోలుకోలేదని ఆసుపత్రి వర్గాలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాయి.
పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.



