
సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి సిట్ నోటీసులు..
ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ గుర్తించారు.
ఈ మేరకు సమాచారం తెలుసుకనేందుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి పలుమార్లు చేశారు.
ఇప్పుడు ఆయన సోదరుడ్ని విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారనే అభియోగాలపై సిట్ తన దూకుడును పెంచింది.
ఎస్ఐబీ మాజీ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు , ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల ఆధారంగా కీలక రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. కొండల్ రెడ్డితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లకు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో , 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిందితులతో వీరు జరిపిన సంభాషణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం నాయకులే కాకుండా, వారి కుటుంబ సభ్యులు , సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు కు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు మాధవరం సందీప్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
అక్రమంగా సేకరించిన సమాచారాన్ని వీరు ఏమైనా వినియోగించుకున్నారా? లేదా అధికారులకు నంబర్లను చేరవేయడంలో వీరి పాత్ర ఉందా? అనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఆయన కస్టడీ విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈ నోటీసుల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల కదలికలను గమనించడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చిన నేతలెవరు? అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది.
ఎమ్మెల్సీ నవీన్ రావును ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన అధికారులు, త్వరలోనే మరికొందరు మాజీ మంత్రులు మరియు కీలక నేతలకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
సాంకేతిక ఆధారాలతో పాటు నిందితుల కాల్ డేటా రికార్డులను విశ్లేషిస్తున్న అధికారులు, ఈ నెలాఖరులోగా కీలకమైన ఛార్జ్షీట్ను దాఖలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ విచారణలో ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.



