
జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండగా ఉంటాం
అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదు
గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ల మంజూరు
ఏకార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి
జర్నలిస్టు సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం
జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం
జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం
14 జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించిన
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించాలని గాని, చిన్నబుచ్చాలని గాని తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.
జీవో 252 పై శనివారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమావేశంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని వారు ప్రస్తావించిన అంశాలను విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు.
అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సుమారు 23వేల అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య కంటే ఈ సారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటివరుసలో ఉందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే సదుద్దేశంతో శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేయడం జరిగిందని పలుమార్లు సమావేశాలు నిర్వహించామని అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్ననియమ నిబంధనలను పరిశీలించడం జరిగిందని ఫలితంగా కొత్త కార్డుల మంజూరులో కొంత జాప్యం జరిగిందని అన్నారు.
మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డుకు ఎలాంటి వ్యత్యాసం లేదని అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మరోమారు స్పష్టం చేశారు.
తాము అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎటువంటి భేషజాలకు పోవడం లేదని కానీ ఈ వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు గాను ప్రభుత్వ పరంగా సర్క్యులేషన్, ఇతర సంబంధిత వివరాలను ఖచ్చితంగా సేకరిస్తామని, ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ల పరిశీలన కూడా చేస్తామని దీనివలన అసలైన పత్రికలు, పాత్రికేయలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో మండలానికో విలేకరి ప్రాతిపదికన గాక జనాభా వారీగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కూడా ఆలోచిస్తామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని అన్నారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఉర్ధూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల పాత్రికేయులకు అక్రిడిటేషన్ సౌకర్యం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేశామని తెలియజేశారు. సమావేశంలో పలువురు పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ఇండ్ల స్ధలాలు, పెన్షన్, బస్పాసులు, పాత్రికేయులకు బీమా తదితర అంశాలను ప్రస్తావించగా మంత్రి పొంగులేటి సావధానంగా వారికి సమాధానమిచ్చారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశంపై కొంతమంది ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై మంత్రి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశాన్ని పరిష్కరించి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించడం జరిగిందన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేయడంతో సమస్య మొదటికి వచ్చిందని అయినా కూడా ఇండ్ల స్ధలాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎటువంటి కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు
ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి , ఐ&పిఆర్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక , సీపీఆర్వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు



