
కారేపల్లి పోలీసులు సీరియస్ వార్నింగ్
కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఓటమిని జీర్ణించుకోలేక గెలిచిన సర్పంచ్ మద్దతుదారులపై ప్రత్యర్థి, అనుచరులు దాడులకు పాల్పడడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుందని ఫిర్యాదు అందుకున్న కారేపల్లి పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.
ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కారేపల్లి ఎస్సై బైరు గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలంపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటమిపాలైన ప్రత్యర్థి, వారి అనుచరులతో కలిసి సర్పంచ్ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఇరు వర్గాల ఫిర్యాదును పరిశీలించి 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఘర్షణలకు పాల్పడకుండా సుమారు 20 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు స్పష్టం చేశారు.
బైండోవర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఘర్షణకు కానీ దాడులకు పాల్పడితే 2 లక్షల రూపాయలు జరిమానా, లేదా సంవత్సరం పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.



